Book Release Event
 
   Subscribe To Slokas
  
     
 
  Introduction
  Home
  Provide Feedback
 
 
   
 
పీఠిక
(This is the foreword of 1984 print edition of Geetaamritam)
 
ఈ భగవద్గీతానువాదకులైన కీర్తిశేషులు డా. పంగనామముల వేంకట సత్యనారాయణరావుగారు పది సంవత్సరముల క్రితము మిత్రులతో భగవద్గీతపై జరిపిన ఒకానొక యాదృఛ్ఛికమైన చర్చ తద్విషయమైన కూలంకషాభ్యాసమునకు కారణభూతమైనది. ప్రసంగవశమున జనించిన కుతూహలాభిషలు సుషుప్తమై యున్న యాలోచనలను జాగృతపరచి రచయితకు జీవన చరమదశలో పరమార్థసాధకము, కైవల్యప్రదమునగు మార్గమును సుగమము చేసినవి.
 
భగవద్గీతను తెలుగులోనికి అనువదించునపుడు తనకు చిరకాలముగా వేమన మరియు యితర శతక రచనలపట్ల గల అభిమానము మిగుల నుపయోగపడినట్లును, వాటియందలి పద్యపాదములవలె భావపరిపూర్ణత, సరళశైలియును గలిగి యుండునట్లు వ్రాయుట తన లక్ష్యమనియు రచయిత తెల్పియుండిరి. మూలమందలి శ్లోక పాదములను తెలిగించునప్పుడు ప్రతిపదార్థము గోచరమగుచు భావఖండితముగ పద్యపాదము లుండునట్లును, పద్యము చదివినప్పుడు సంస్కృత శ్లోకము వెంటనే స్ఫురణకు వచ్చునట్లును రచన చేయుటకు వీరు చివరి నిమిషమువరకు ప్రయత్నము చేసినారు.
 
శ్రీ సత్యనారాయణరావుగారు కృష్ణజిల్లా జగ్గయ్యపేట తలూకా షేరుమహమ్మదుపేట వాస్తవ్యులైన కీ.శే. లక్ష్మయ్య వెంకట్రామనరసమ్మగార్లకు 1918 జనవరి 26వ తేదీన జన్మించిరి. వీరు అయిదుగురు అన్నదమ్ములలో జ్యేష్ఠులు. ఒక అక్కగారును ఇద్దరు చెల్లెండ్రును గలరు. పాఠశాల విద్యాభ్యాసము స్వగ్రామములోను, జగ్గయ్యపేటలోను జరిగినది. పిమ్మట మచిలీపట్టణము హిందూకళాశాలలోను, విశాఖ్పట్టణమునగల వైద్యకళాశాలలోను ఉన్నత విద్యార్జనచేసి వైద్య పట్టభద్రులై 1942 లో జగ్గయ్యపేటలో వైద్యవృత్తిలో స్థిరపడిరి.
 
ఖమ్మంజిల్లా నాగులవంచ గ్రామకాపురస్తులైన కీ.శే. చందర్లపాటి నారయణరావుగారి ద్వితీయ పుత్రికను 1935 వ సంవత్సరములో వివహము చేసికొనిరి. వీరికి కలిగిన సంతానము యిద్దరు మగపిల్లలు, నలుగురు ఆడబిడ్డలు, నలుగురు మనుమలు.
 
1974 వ సంవత్సరములో మొదలైన తెలుగుసేత దాదాపు నాలుగు సంవత్సరములకుగాని పూర్తికాలేదు. ఈ మధ్యకాలమునందు మధుమేహము, రాచకురుపు, రక్తపుపొటువలన రోగపీడితులయ్యును, రచనను ఒక తపస్సుగా కొనసాగించిరి. గీతామృతమును గ్రోలుట మొదలు పెట్టినప్పటినుండియు వీరి జీవన విధానమునందు పెద్దమార్పును పరిచితులందరును గమనించియే యుండిరి. ముఖ్యముగా చివరి రెండు మూడు సంవత్సరములు వృత్తిధర్మమును నిర్వర్తించుచు తాము చేసిన అనువాదమును పునః పునః స్వయముగా పరిశీలించుకొని తప్పులను దిద్దుకొనుచు, వ్రాతప్రతుల నెన్నిటినో స్వహస్తముతో లిఖించి మిత్రులకు బంధువులకు యిచ్చియుండిరి.
 
నాకు పిత్రుతుల్యులు, అగ్రజులునైన గ్రంధకర్తతో జరిపిన యిష్టాగోష్ఠిలో యీ అనువాదమును ప్రచురించిన బాగుండును గదా యని సూచన చేసితిని. దానికి వారు యిది ఆత్మానందము కొరకు చేసిన కృషియనియు, మరికొందరు మిత్రులు కూడా సలహానిచ్చియుండిరనియు, కాని తమకే యిది ప్రచురణార్హమా అన్న సందియమున్నదనియు దెల్పినారు. తిరుమల తిరుపతి దేవస్థానమున కప్పటి కార్యనిర్వణాధికారియైన శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాదుగారు దీని వ్రాతప్రతిని శ్రద్ధతో పరిశీలన చేయించి దయతో నాలుగువేల రూపాయలకుపైగా ప్రచురణార్ధము సహాయముగా బ్రకటించిరి.
 
పిమ్మట మదరాసులో దీని నచ్చు వేయించవలెననియు, అందుకు రచయితే స్వయముగా కొంతకాలము అక్కడ వుండి ప్రచురణ పూర్తి చేయించవలెననియు, 1982 ఆగస్టులో సంకల్పించటము జరిగినది. అయితే తద్భిన్నముగా శ్రీ సత్యనారాయణరావుగారు అదే సంవత్సరము సెప్టెంబరు 6వ తేదీన ఆకస్మికముగా దివంగతులగుట వలన యీ సంకల్పము నెరవేరలేదు.
 
అప్పటినుండి యీ ప్రచురణ బాధ్యత నాపైబడినది. నాకున్న కార్యభారమువల్లను, కారణాంతరములవల్లను, యీనాటికిగాని గ్రంథమును అచ్చువేయించి విడుదల చేయుటకు సాధ్యపడినది కాదు. నాకు తెలిసినంతవరకు రచయితను గురించి వారి రచనను గురించి క్లుప్తముగా వివరించుట నా బాధ్యతగా భావించి యీ పీఠికను వ్రాసితిని గాని, నాకు నిజముగా అందుకు తగిన అర్హత యున్నట్లు భావించను. అనువాదకులే స్వయముగా యీవిషయము వ్రాయ సంకల్పించినప్పటికిని వారి హఠాన్మరణము అందుకు ఆటంకమైనది.
 
ఈ ప్రచురణకు సాయపడినవారిని గురించి వ్రాయుటకు మరికొద్ది స్థలము నుపయోగించవల్సి యున్నది. వ్రాతప్రతిని ఆమూలాగ్రముగ జదివి తప్పులను దిద్దుకొను నవకాశమిచ్చిన గుంటూరు నివాసులగు శ్రీ మిన్నికంటి గురునాధశర్మగారికిని, వరంగలు ఎ.వి.వి. జూనియరు కళాశాలలో తెలుగు ఉపన్యాసకులైన మిత్రులు శ్రీ పి.ఎల్.ఎన్. ప్రసాదుగారికిని, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ తెలుగు భాషా విభాగంలో రీడరుగానున్న డా. జి.వి. సుబ్రహ్మణ్యంగారికిని, ద్రవ్య సహయమును ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారికిని రచయిత పక్షమున నా కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. ఈ ప్రచురణ ప్రయత్నముగురించి వినినంతనే ఐదువందల రూపాయలను విరాళముగానొసంగిన గుంటూరుజిల్లా పొలూరు వాస్తవ్యులు శ్రీ ఆర్. రామమూర్తి గారికి మా ధన్యవాదములు.
 
అయితే రచయితకును నాకును మేనబావయైన శ్రీ కె.వై.ఎల్. నరసిమ్హారావుగరు యీ గ్రంథ ముద్రణా పర్యవేక్షణ బాధ్యతను సంతోషముతో స్వీకరించి సఫలీకృతులైనారు. వారికిని, యీ పుస్తకమును రమ్యముగా అచ్చువేసి యిచ్చిన రమేష్ ప్రింటర్స్ & పబ్లిషర్స్ వారికిని మా హృదయపూర్వకమైన ధన్యవాదములు. విజ్ఞులు, విద్వన్మణులును అయిన పఠితలు యీ గ్రంథమును జదివి యందలి విషయ పరిశీలన చేసి ఏవేని దోషములున్న వాటిని సూచించినయడల ముందు ముందు సవరించు ప్రయత్నముజేయగలమని మనవి చేయుచున్నాను.
 
భగవద్గీతానుసారముగా ప్రతిఫలాపేక్షరహితమయిన కర్మములనుజేయుచు, భక్తి జ్ఞాన శ్రద్ధా యోగములను మానవజీవితమునకన్వయించుకొనుచు అంతర్బహిర్గతముగా శాంతి సామరస్య సాధనలే లక్ష్యముగా దైనందిన కార్యక్రమమును రూపొందించుకొనుచున్న సహజ వనరుల అభివృద్ధి సహకార సంఘమువారి సౌజన్యము యీ ప్రచురణలో అంతర్లీనము.
 
పి.వి.ఎల్.ఎన్. రావు
రక్తాక్షి : విజయదశమి
హైదరాబాదు